పశుగ్రాసం సాగుకు ఉపాధి హామీ పథకంలో ప్రోత్సాహం
లింగాల మేజర్ న్యూస్:- మండలంలోని మురారితల వెటర్నరీ డాక్టర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ పశుపోషణను ప్రోత్సహించడంతో పాటు పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా వ్యక్తిగత భూముల్లో పశుగ్రాసం సాగును అభివృద్ధి చేసేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వ్యక్తులు తమ సొంత భూముల్లో పశుగ్రాసం సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పశువుల సంఖ్యను బట్టి సాగు చేసుకునే భూమి విస్తీర్ణాన్ని నిర్ణయించారు. రెండు జంతువులు వరకు ఉన్న రైతులకు 0.25 ఎకరాలు (25 సెంట్లు), 3 నుంచి 5 జంతువులు ఉన్న వారికి 0.50 ఎకరం (50 సెంట్లు), ఐదుకంటే ఎక్కువ జంతువులు ఉన్న వారికి గరిష్టంగా 1.0 ఎకరం భూమిలో పశుగ్రాసం సాగు చేసుకునే ప్రభుత్వం అవకాశం కల్పించారు.
రెండేళ్లపాటు నిర్వహణకు అవకాశం
వ్యక్తిగత భూముల్లో పశుగ్రాసం సాగు కోసం కార్యాచరణను రెండు సంవత్సరాల కాలానికి అందించాలని నిబంధనల్లో ఉంటుందన్నారు.ఇందులో ఒక సంవత్సరం పంట సాగు చేయడంతో పాటు, మరో సంవత్సరం పశుగ్రాసం పెంపకం, నిర్వహణకు కేటాయించబడుతుంది.
పశువుల పెంపకంపై ఆధారపడే రైతులకు పశుగ్రాసం అందుబాటులో ఉండటం ఎంతో కీలకం. ప్రస్తుతం పశుగ్రాసం కోసం రైతులు బయట నుంచి కొనుగోలు చేయాల్సి రావడంతో అదనపు ఖర్చులు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సొంత భూముల్లోనే పశుగ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా పశుపోషణ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఏడాది పొడవునా పశువులకు పచ్చి మేత అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
అర్హత కలిగిన రైతులు సద్వినియోగం చేసుకోవాలి
పశువులు ఉన్న అర్హత కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ డాక్టర్ సుబ్బరాయుడు తెలిపారు.
లింగాల రిపోర్టర్ సాయినాథ్ రెడ్డి కడప జిల్లా