పరిష్కారం కాని అర్జీల వివరాలకు 1100కు కాల్ చేయండి
బాపట్ల,మేజర్ న్యూస్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ప్రతి సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు గతంలో అందిన అర్జీల పరిష్కారంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి కొత్త అర్జీలను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.గతంలో సమర్పించిన అర్జీలు పరిష్కారం కాకపోయినా, వాటి ప్రస్తుత స్థితిగతులపై సమాచారం కావాలన్నా 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. అలాగే meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు.