పర్చూరులో రూ.74.37 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం : పర్చూరు సభలో హోం మంత్రి అనిత
పర్చూరు:
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. గురువారం పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ఆమె పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించడం శుభపరిణామమన్నారు. దీనివల్ల సుమారు 28 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. డీఎస్సీని కూడా ప్రతిపక్షం రాజకీయాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ ద్వారానే తాను ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యానని గుర్తుచేశారు.
రాష్ట్రంలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామని అనిత తెలిపారు. తమ పిల్లలు గంజాయికి అలవాటుపడ్డారని పలువురు తల్లులు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, బాధితులకు చికిత్స, పునరావాసం కల్పించేందుకు రిహాబిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భద్రత కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని భరోసా ఇచ్చారు.
అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. పర్చూరు నియోజకవర్గంలో రూ.74.37 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు వచ్చిన హోంమంత్రి అనితకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్చూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.
జల్ జీవన్ మిషన్ పనులు, గుంటూరు ఛానల్ పొడిగింపు, ఎస్సీ హాస్టల్ నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర పనులు నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. పర్చూరు నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ఎంతో ప్రయోజనకరమన్నారు. గతంలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు చీరాల, చిలకలూరిపేట నుంచి సిబ్బంది రావాల్సి వచ్చేదని, స్థానికంగా ఫైర్‌స్టేషన్ ఏర్పాటుతో సకాలంలో సేవలు అందే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇందుకు సహకరిస్తున్న హోంమంత్రి అనితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రూ.74.37 కోట్లతో అభివృద్ధి పనులు
హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే ఏలూరితో కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.59.74 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో నిర్మిస్తున్న నూతన ఎస్టీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. పర్చూరు ఇందిరా కాలనీలో రూ.3 కోట్లతో నిర్మించిన 22 సీసీ రోడ్లను ప్రారంభించారు.
అభివృద్ధి పనుల వివరాలు:
* రూ.59.74 కోట్లు: నియోజకవర్గవ్యాప్తంగా జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన.
* రూ.5 కోట్లు: పర్చూరులో నిర్మాణంలో ఉన్న నూతన ఎస్టీ హాస్టల్ భవనం పరిశీలన.
* రూ.3 కోట్లు: స్వయం సహాయక సంఘాలకు శ్రీనిధి రుణాలు, పనిముట్ల పంపిణీ.
* రూ.3 కోట్లు: పర్చూరు ఇందిరా కాలనీలో నిర్మించిన 22 సీసీ రోడ్ల ప్రారంభోత్సవం.
* రూ.1.08 కోట్లు: మూడు విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు శంకుస్థాపన.
* రూ.96 లక్షలు: పర్చూరు పట్టణంలో 12 కి.మీ. మేర మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన.
* రూ.67 లక్షలు: లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ.
* రూ.44 లక్షలు: శ్రీ వెంకటేశ్వరస్వామి పాదాల రోడ్డుకు శంకుస్థాపన.
* రూ.35 లక్షలు: వెటర్నరీ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన.
* రూ.12.50 లక్షలు: ఫిల్టర్ బెడ్ ప్రారంభోత్సవం.
మహిళా సంఘాలకు రూ.3 కోట్ల శ్రీనిధి రుణాలు
పర్చూరులో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.3 కోట్ల విలువైన శ్రీనిధి రుణాలు, పనిముట్లను మంత్రి అనిత, ఎమ్మెల్యే ఏలూరి పంపిణీ చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సందడి
అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా పర్చూరు వై జంక్షన్‌లో టీడీపీ శ్రేణులు హోంమంత్రికి ఘనస్వాగతం పలికారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించి బాణాసంచా పేల్చి స్వాగతం తెలిపారు.