పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల దగ్గ పాత్ర - జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎస్ఎంసి ఎన్నికలు - 2357 పాఠశాలల్లో ముగిసిన ఎన్నికలు - కోరం లేకపోవడంతో ఏడు పాఠశాలలో ఎన్నికలు వాయిదా - ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించిన డీఈఓ కెవిఎన్ కుమార్
పాఠశాల అభివృద్ధి, పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, ఆ దిశగా తల్లిదండ్రులు వారి అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించి భాగస్వాములు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్.కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ పునర్వ్యవస్థీకరణ భాగంగా మంగళవారం జిల్లాలో ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిష్పర్శపాతంగా నిర్వహించారు. జిల్లాలోని 2,364 పాఠశాలలకు గాను 2,357 పాఠశాలల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని, 7 పాఠశాలల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయని వెల్లడించారు. మిగిలిన అన్ని పాఠశాలల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించినట్లు తెలిపారు.తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎస్ఎంసి ఎన్నికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. పిల్లల చదువు, వారి ప్రవర్తన, విద్యా పురోగతిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థుల విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు సత్సంబంధాలు కొనసాగించాలని అన్నారు. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో ఎస్ఎంసి సభ్యులు, తల్లిదండ్రులు చురుకుగా పాల్గొనాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు మొబైల్ ఫోన్లను ఏ విధంగా వినియోగిస్తున్నారనే అంశాన్ని తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. మాదకద్రవ్యాల వంటి ప్రమాదకర కార్యకలాపాలకు విద్యార్థులు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలకు మంచి విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవర్చడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని డీఈఓ పేర్కొన్నారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసినప్పుడే విద్యార్థుల్లో మెరుగైన విద్యా ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. తిరుచానూరు పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి సుమారు 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు మురళి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటముని, లీలా ప్రతాప్, ఎస్ఎంసి సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి