పాఠశాల, ఆలయం సమీపంలో మద్యం దుకాణం రద్దు చేయండి: ఎక్సైజ్ అధికారులకు గ్రామస్థుల వినతి
బోగోలు:మేజర్ న్యూస్ :
మండల పరిధిలోని చెంచులక్ష్మీపురం గ్రామంలో ఎంపీపీఎస్ మోడల్ స్కూల్, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంబంధిత ఎక్సైజ్ అధికారులకు గ్రామస్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.విద్యార్థులు రాకపోకలు సాగించే పాఠశాల వద్ద, భక్తులు నిత్యం వచ్చే ఆలయ పరిసరాల్లో మద్యం షాపు ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలు, ప్రార్థనా మందిరాల నుంచి ఉండాల్సిన కనీస దూరాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో కొలవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దుకాణానికి అనుమతులు మంజూరు చేయవద్దని, విద్యార్థులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.