పార్వతీపురం అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తగా అల్లు రమేష్ నియామకం
సీతానగరం, సూర్య : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ఎన్నికల సమన్వయాన్ని పటిష్టంగా నిర్వహించడం లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమన్వయ కమిటీలను ప్రకటించారు. ఇందులో భాగంగా పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా సీతానగరం మండలం గెడ్డలుప్పి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు అల్లు రమేష్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతను అప్పగించింది.
నియోజకవర్గ పరిధిలోని క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకర్తల సమాచారం, ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణలను సమన్వయం చేసి, వాటిని అరకు పార్లమెంటరీ స్థాయిలో నియమితమైన కమిటీకి అందించడం ఈ నియామకం ప్రధాన ఉద్దేశం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ, ఎన్నికల వ్యూహాల అమలులో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.ఈ సందర్భంగా అల్లు రమేష్ మాట్లాడుతూ, “పార్టీ కోసం కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు జనసేనలో గుర్తింపు, బాధ్యతలు లభిస్తాయనేందుకు నా నియామకం ఒక నిదర్శనం. గతంలో పార్టీ అధిష్ఠానం నాకు కార్యనిర్వాహక కార్యదర్శిగా అవకాశం కల్పించింది. ఇప్పుడు మరోసారి నాపై నమ్మకం ఉంచి పార్వతీపురం అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని “అధిష్ఠానం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో, నిష్పక్షపాతంగా, సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహిస్తాను. పార్టీ బలోపేతానికి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన విజయావకాశాలను మెరుగుపరిచేందుకు నా వంతు కృషి చేస్తాను” అని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా, సీతానగరం మండలం నుంచి ఈ ఎన్నికల సమన్వయ కమిటీలో స్థానం సంపాదించిన ఇతర నాయకులకు, కార్యకర్తలకు అల్లు రమేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.