పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులే కీలకం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులే కీలకమని పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, స్థానికంగా ఉపాధి అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సి ఐ ఐ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఈ డి బి సంయుక్త ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ కాకినాడ ప్రాంగణంలో నిర్వహించిన 31వ సి ఐ ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్–2026 ప్రాంతీయ సదస్సుకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ హాజరయ్యారు.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలు, పెట్టుబడుల సాధన, పరిశ్రమల విస్తరణ, యువతకు ఉపాధి కల్పన తదితర అంశాలపై సదస్సులో చర్చలు జరిగాయి. పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయంతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, తద్వారా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభించే అవకాశం ఉందని ఈ సదస్సు ప్రాధాన్యతను సంతరించుకుంది.
జిల్లా స్థాయిలో పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన సమన్వయం, పరిశ్రమల స్థాపనకు సంబంధించిన సమస్యల పరిష్కారం, ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాల్లో జిల్లా యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగ ప్రతినిధులతో పరస్పర అవగాహన, పెట్టుబడుల అవకాశాలపై చర్చలకు ఇటువంటి ప్రాంతీయ సదస్సులు దోహదపడతాయి.ఈ కార్యక్రమంలో పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సి ఐ ఐ , ఈ డి బి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.