ఓటు హక్కును వినియోగించుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి, బుట్నా లక్ష్మి.
**కళ్యాణదుర్గం:** పట్టణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఎన్డీయే కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి తిమ్మరాజు ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ నార్త్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె, సాధారణ ఓటర్ల మాదిరిగానే క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు పట్టణ భవిష్యత్తు, అభివృద్ధి దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తన ఓటు విలువను గుర్తించి, ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించిన విలువైన అవకాశం అని, దానిని బాధ్యతగా వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు. ఓటు వేయడం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి బలాన్నిస్తుందని ఆమె పేర్కొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.