ఓట్ల లెక్కింపునకు 943 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు!
నెల్లూరు,అర్బన్, క్రైమ్, మేజర్ న్యూస్ : జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.నవంబర్ 7న జిల్లావ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో నిర్వహించనున్న కౌంటింగ్ ప్రక్రియకు మొత్తం 943 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు.ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.జిల్లాలోని 34 మండలాల పరిధిలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరు కేంద్రాల్లో జరగనుంది. మొత్తం 30 జడ్పీటీసీ స్థానాలకు 103 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, పరిసర ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.అనుమతి కలిగిన వ్యక్తులు మినహా ఇతరులు కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.కౌంటింగ్ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, పోలీసు ఆంక్షలపై ఇప్పటికే అన్ని పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు.పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బి ఎన్ ఎస్ ఎస్) సెక్షన్ 163 నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.నెల్లూరులోని వీఆర్ పీజీ స్టడీస్, వైఎంసీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించే కౌంటింగ్‌కు టౌన్ ఎస్‌డీపీఓ దీక్షా ఐపీఎస్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. ఈ కేంద్రంలో నెల్లూరు రూరల్, టీపీ గూడూరు, వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు, మనుబోలు మండలాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉత్తర రాజుపాలెంలోని జీవన జ్యోతి డిగ్రీ కళాశాలలో జరిగే కౌంటింగ్‌కు నెల్లూరు రూరల్ డీఎస్పీ జి. శ్రీనివాసరావు ఇన్‌చార్జిగా ఉంటారు. ఇక్కడ కోవూరు, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల ఓట్లు లెక్కిస్తారు.కావలిలోని పీబీఆర్ వీఈసీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగే కౌంటింగ్‌కు కావలి ఎస్‌డీపీఓ వి.వి. రమణకుమార్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. ఈ కేంద్రంలో వింజమూరు, కలిగిరి, కొండాపురం, కావలి, జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.ఉదయగిరిలోని ఎంజీఆర్ అగ్రికల్చరల్ డిగ్రీ కళాశాలలో జరిగే కౌంటింగ్‌కు నెల్లూరు డబ్ల్యూపీఎస్ డీఎస్పీ కె. వేమారెడ్డి ఇన్‌చార్జిగా ఉంటారు. ఇక్కడ ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల ఓట్లు లెక్కిస్తారు.ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే కౌంటింగ్‌కు ఆత్మకూరు ఎస్‌డీపీఓ టి. వెంకటేశులు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు.ఈ కేంద్రంలో మర్రిపాడు, సంగం, ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం, చేజర్ల, కలువాయి మండలాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గూడూరులోని ఎస్.వి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే కౌంటింగ్‌కు గూడూరు ఎస్‌డీపీఓ కె. నరసింహమూర్తి ఇన్‌చార్జిగా ఉంటారు.ఇక్కడ రాపూరు, సైదాపురం, గూడూరు, చిల్లకూరు, కోట మండలాల ఓట్లు లెక్కిస్తారు.కౌంటింగ్ అనంతరం విజయోత్సవాల పేరుతో ఎలాంటి ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఎస్పీ హెచ్చరించారు. పోలీసు శాఖ ముందస్తు అనుమతి లేకుండా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం, అధిక శబ్దంతో డీజేలు వినియోగించడం, రహదారులపై ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం నిషేధమని స్పష్టం చేశారు.ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలపై దాడులు, బెదిరింపులు, దూషణలు, కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు, కుల, మత, రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గతంలో ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడిన వ్యక్తులు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉండే పోలీసు అధికారుల ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.గెలుపోటములను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలని, విజేతలు, పరాజితులు సంయమనం పాటించాలని కోరారు.ఎక్కడైనా ఘర్షణలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తితే వెంటనే డయల్ 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.