నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తిని నేను:..... కోలగట్ల వీరభద్ర స్వామి
విజయనగరం, సూర్య : స్థానిక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కోలగట్ల శ్రావణి, 44వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మజ్జి అరుణకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త, మాజీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి బుధవారం 44వ డివిజన్ పరిధిలోని బీసీ కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు ఆయనకు పూలమాలలు వేసి, హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోలగట్ల వీరభద్ర స్వామి, ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల మధ్యకు వెళ్లే విధానం తమది కాదని, ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారమని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని జనరల్ మహిళా కేటగిరీకి కేటాయించడం, పార్టీ పెద్దలు, సీనియర్ నాయకుల సూచనల మేరకు తన కుమార్తె కోలగట్ల శ్రావణిని మేయర్ అభ్యర్థిగా నిలబెట్టినట్లు తెలిపారు. గతంలో డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు న్యాయవ్యవస్థపై అవగాహన, పరిపాలనా పరిజ్ఞానం ఉండటం ఆమెకు అదనపు బలమని పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వదించి మేయర్‌గా గెలిపిస్తే విజయనగరం పట్టణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తుందని అన్నారు.
కూటమి ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన తర్వాతే తమకు ఓటు వేయాలని ప్రజలను కోరే ధైర్యం కూటమి నాయకులకు ఉందా? అని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పేదలు వినియోగించే బియ్యం ధరలు కూడా పెరగడం ప్రజలపై భారంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 44వ డివిజన్ బీసీ కాలనీలో 27 సీసీ రోడ్లను నిర్మించినట్లు కోలగట్ల వివరించారు. వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులను క్రమబద్ధంగా చేపట్టామని తెలిపారు. స్థానికుల కోరిక మేరకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో వాటర్ ట్యాంకును కూడా నిర్మించినట్లు పేర్కొన్నారు. అయితే, అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తాము నిర్మించిన వాటర్ ట్యాంకును తామే ప్రారంభించినట్లు ప్రచారం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కోలగట్ల శ్రావణిని, 44వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మజ్జి అరుణను ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, ప్రజల ఆశీస్సులు అందించాలని కోలగట్ల వీరభద్ర స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ కడియాల రామకృష్ణ, మజ్జి బాబురావు, వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.