నగర కార్పొరేషన్ మేయర్ పదవిని దళిత, గిరిజన వర్గాలకు కేటాయించాలి
అనంతపురంబ్యూరో ,
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం నగర కార్పొరేషన్ మేయర్ పదవిని దళిత, గిరిజన వర్గాలకు కేటాయించాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు అన్ని రాజకీయ పార్టీలను కోరారు.
ఇప్పటివరకు బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు మేయర్లుగా పనిచేశారని, ఈసారి దళిత లేదా గిరిజన వర్గాలకు చెందిన విద్యావంతులు, ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉన్నవారికి అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేయర్ పదవి కేటాయింపుతో పాటు నగర అభివృద్ధికి ప్రభుత్వం, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
రాజకీయ పార్టీలు స్పందించని పక్షంలో RPS ఆధ్వర్యంలో దళిత, గిరిజన, బలహీన వర్గాలతో కలిసి మేయర్ అభ్యర్థిని బరిలోకి దింపే అంశాన్ని పరిశీలిస్తామని నాగరాజు తెలిపారు. ప్రజల మద్దతుతో అభ్యర్థి విజయానికి విస్తృత ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు.