మోపిదేవిలో కూటమి ప్రచారానికి విశేష స్పందన
మోపిదేవి, మేజర్ న్యూస్: అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు ముమ్మర ప్రచారం నిర్వహించారు. సోమవారం మోపిదేవి ప్రధాన కూడలిలో జడ్పీటీసీ అభ్యర్థి మురాల సీతమ్మ, మోపిదేవి-1 ఎంపీటీసీ అభ్యర్థి నందిగం శంకరరావుతో పాటు మండలంలోని కూటమి అభ్యర్థులతో కలిసి ప్రచారం చేపట్టారు. టీడీపీ కార్యాలయం నుంచి ప్రధాన కూడలి మీదుగా రావివారిపాలెం రోడ్డు, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, బస్టాండ్ ప్రాంతాల్లో పర్యటిస్తూ వ్యాపారులు, ప్రజలను కలుసుకుని మద్దతు కోరారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని పలువురు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విక్కుర్తి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఓటరు తమ రెండు ఓట్లను సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తులపై వేసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు నడకుదిటి జనార్దనరావు, మాజీ సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు, జనసేన మండల అధ్యక్షుడు పూషడపు రత్నగోపాల్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.