మార్కాపురం మున్సిపల్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన
మార్కాపురం మేజర్ న్యూస్
మార్కాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మార్కాపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.నామినేషన్ల స్వీకరణకు అవసరమైన స్టేషనరీ, రిజిస్టర్లు, ఇతర రికార్డుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. కేంద్రం వద్ద రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అభ్యర్థులు, వారి ప్రతినిధుల రాకపోకల విషయంలో ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు శాంతిభద్రతల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా ఐపీఎస్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.