"లెక్క"లు కుదరలేదా...! -ఆ పోస్టుల నియామకంపై నిర్లక్ష్యం ఎందుకో... -అధికారుల నిర్ణయాలపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూలో గత పాలక మండలి గడువు ముగిసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నియమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో పాటు వర్సిటీలో కీలకమైన పరిపాలనా పదవులను భర్తీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు, పరిశోధకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్సీటీలో సీడీసీ డీన్ పోస్టు భర్తీ చేయడంలోనూ నిర్లక్ష్యం వహించడంలో ఆంతర్యమేమిటో అర్థం కాలేదని అధ్యాపకులు చర్చించుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా వర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించాలని అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
-తక్షణం భర్తీ చేయాలి…
ఎస్వీయూలో అర్హత సమర్థత కలిగిన ఆచార్యులకు కీలక పదవులు కేటాయించకుండా తమకు అనుకూలమైన వారిని పదవుల్లో కొనసాగిస్తున్నారని ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ ఆరోపిస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యుల నియామకం జరగకపోవడంతో బోధన, పరిశోధన, ఫెలోషిప్లకు సంబంధించిన కీలక నిర్ణయాలపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి అర్హలను ఈసీ మెంబర్లుగా ప్రభుత్వం వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. సీడీసీ డీన్ పదవి ఖాళీగా ఉండటంతో విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల పర్యవేక్షణలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రధానంగా న్యాయ కళాశాలల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రైవేట్ పీజీ, డిగ్రీ కళాశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై కూడా అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఎస్వీయూ ఫార్మసీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ తో పాటు హెచ్ఐడీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్), డీన్ ఆఫ్ ఫ్యాకల్టీ వంటి కీలక పదవులు భర్తీ చేయాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో పలువురు అర్హతగల అధ్యాపకులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్