లలితా పరమేశ్వరిగా అమ్మవారి దివ్య దర్శనం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
నెల్లూరు మూలపేటలోని ప్రసిద్ధ శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఆలయంలో విశేష అభిషేకాలు, చండీ హోమాలు, పల్లకీ సేవ, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి.
ఉదయం వేళ ఆలయ మూలవిరాట్కు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం లోక కల్యాణార్థం నిర్వహించారు.
సాయంత్రం శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు "శ్రీ లలితా పరమేశ్వరి దేవి" విశేష అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అనంతరం మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వహించిన సామూహిక లలితా సహస్రనామ పారాయణ భక్తిభావంతో సాగింది. సాయంత్రం విశేష చండీ యాగాలు నిర్వహించారు. హోమానంతరం మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ప్రాకార పల్లకీ సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వాహణాధికారి , అర్చక బృందం మరియు ఆలయ సిబ్బంది పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు