క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
క్యాన్సర్ వ్యాధి పై ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా ఉందని, ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర పర్యాటక శాఖా మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం జి.ఎస్.ఎల్ .సూర్య హెల్త్ కేర్ సెంటర్ ను చిరంజీవి ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణం వద్ద ఏర్పాటుచేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. క్యాన్సర్ అంటే భయపడకుండా ముందుగా పరీక్షలు చేయించుకుని ,వ్యాధి నివారణ పై దృష్టి పెట్టాలన్నారు. పాన్ పరాగ్, గుట్కా, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే ముప్పు తో పాటు రాష్ట్రంలోని పరిస్థితులపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. మానవతా దృక్పథంతో ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే సూర్య హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం, తన చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలపై ఆనందం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాకతో గ్రామంలో ఉదయం నుండి సందడి వాతావరణం నెలకొంది .అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పురవీధులు జనంతో కిక్కిరి సాయి. కేవలం సినిమాల్లోనే చూసే చిరంజీవిని ప్రత్యక్షంగా చూసేందుకు పరిసర గ్రామాల నుండి జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జిఎస్ఎల్ కళాశాల , ఆసుపత్రి చైర్మన్ గన్ని భాస్కరరావు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జీవి చౌదరి, సూర్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, వైద్య సిబ్బంది,స్థానిక నాయకులు నెక్కంటి రామ్ జి, రెడ్డి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు