కంబదూర్ ఎస్ ఐ పై చర్యలు తీసుకోవాలి...
**కళ్యాణదుర్గం మేజర్ న్యూస్ :-
కంబదూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్సీల పట్ల దురుసుగా వ్యవహరిస్తూ, అకారణంగా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ఎస్‌ఐ లోకేష్‌పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. పోలీసుల విధులు ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం కావాలని, అందుకు విరుద్ధంగా ప్రజల పట్ల దురుసుగా వ్యవహరించడం, భౌతిక దాడులకు పాల్పడటం తగదని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో బాధితులతో కలిసి జిల్లా ఎస్పీ జగదీష్‌ను కలిసి కంబదూరు ఎస్‌ఐ లోకేష్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకొని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని వేధించడం సరికాదన్నారు. ఎటువంటి నేరారోపణలు లేని వ్యక్తులను సైతం పోలీస్‌స్టేషన్‌కు బలవంతంగా రప్పించి గంటల తరబడి కూర్చోబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల పోలింగ్ రోజున బహిరంగ ప్రదేశాల్లోనే కొందరిని దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడినట్లు బాధితులు వాపోతున్నారని తెలిపారు. కురాకలపల్లి గ్రామానికి చెందిన అయ్యంపల్లి నాగరాజుపై ఎస్‌ఐ దాడి చేయడంతో చెవికి తీవ్ర గాయమైందని, గొల్లపల్లి గ్రామానికి చెందిన మాదిగ అశోక్‌పై లాఠీతో దాడి చేయడంతో చేయి విరిగిందని ఆరోపించారు. పోలీసుల చర్యల కారణంగా బాధితులు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్ల అనంతపురం, అండేపల్లి, ఎగువపల్లి, కురాకలపల్లి తదితర గ్రామాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిపై వేధింపులు అధికమయ్యాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం ఉంటాయని, చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఎస్‌ఐ వ్యవహారశైలిపై విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని కోరారు. సంబంధిత అధికారుల నుంచి న్యాయం జరగకపోతే కంబదూరు మండలంలోని బాధితులందరినీ సమీకరించి త్వరలో డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సాకే హరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంబదూరు మండల ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కురాకలపల్లి గోపాల్, బాధితులు నాగరాజు, అశోక్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన గంగన్న, నాగేంద్ర, శ్రీధర్, నారేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.