కౌంట్ డౌన్.... * ఉదయం 8 నుంచి ప్రారంభం *
విజయనగరం బ్యూరో, సూర్య : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మూడు మున్సిపాల్టీల్లో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. విజయనగరం కార్పొరేషన్‌కు సంబంధించి రాజీవ్ స్టేడియంలో, నెల్లిమర్ల నగర పంచాయతీకి సంబంధించి సి.కె.ఎమ్. జూనియర్ కళాశాలలో, బొబ్బిలి మున్సిపాల్టీకి సంబంధించి గ్రోత్ సెంటర్‌లోని ఏపీఐఐసీ భవనంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటి ప్రక్కనే లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి అన్నిచోట్లా ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా టేబుల్ కి 4 గురు సిబ్బందిని నియమించారు. విజయనగరం కార్పొరేషన్‌లో మేయర్ ఓట్ల కౌంటింగ్ కోసం 31 టేబుళ్లు, 62 వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపునకు మరో 31 టేబుళ్లను ఏర్పాటు చేశారు. దీనికోసం మొత్తం 62 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు రౌండ్లలోనే లెక్కింపు అంతా దాదాపు పూర్తి అయ్యే అవకాశం ఉంది. అలాగే బొబ్బిలిలో చైర్మెన్, 36 వార్డుల కౌన్సిలర్ ఓట్ల లెక్కింపు కోసం చెరో 9 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నాలుగు రౌండ్లలో ఇక్కడ ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. అలాగే నెల్లిమర్లలో చైర్మెన్ ఓట్ల లెక్కింపునకు 4 టేబుళ్లు, 23 వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపునకు 3 టేబుళ్ల చొప్పున కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఆరు రౌండ్లలో ఫలితాలు వెల్లడి కానున్నాయి.
అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్దా 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదు. ఫలితాలు వెల్లడయ్యేవరకు విరామం లేకుండా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతీ టేబుల్ దగ్గరా వీడియో రికార్డింగ్ జరుగుతుంది. కౌంటింగ్ హాలులోకి ఆహార పానీయాలను, వాటర్ బాటిల్స్ ను కూడా అనుమతించరు. కౌంటింగ్ హాలు వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.