జిల్లా ఎన్నికల పరిశీలకులుగా మల్లవరపు సూర్య తేజ..
శ్రీకాకుళం, జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా ఎన్నికల పరిశీలకులుగా మల్లవరపు సూర్య తేజ నియమితులయ్యారు. శనివారం జిల్లా పరిషత్తులో ఆయన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న మున్సిపల్, పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు తీరును ఆయన సమీక్షించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ప్రతి దశను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలపై వారు చర్చించారు.ఎన్నికల యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేస్తూ, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేసేలా చూడాలని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. నామినేషన్ల నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు.