జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు, మేజర్ న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 35 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఐదు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 30 స్థానాలకు 103 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో మొత్తం 440 ఎంపీటీసీ స్థానాలకు గాను సీతారాంపురం మండలంలో 78 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 362 స్థానాలకు ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆరు కౌంటింగ్ కేంద్రాల్లో ఆయా మండలాల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మర్రిపాడు, సంగం, ఆత్మకూరు, అనంతసాగరం, అనుమసముద్రంపేట, చేజర్ల, కలువాయి మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని జీవనజ్యోతి జూనియర్ కళాశాలలో కొవ్వూరు, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు. కావలిలోని పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాలలో విన్జమూరు, కలిగిరి, కొండాపురం, కావలి, జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. గూడూరులోని ఎస్‌వీ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలలో రాపూరు, సైదాపురం, గూడూరు, చిల్లకూరు, కోట మండలాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. నెల్లూరులోని వీఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ స్టడీస్‌లో టీపీ గూడూరు, నెల్లూరు రూరల్, వెంకటాచలం , ముత్తుకూరు, పొదలకూరు, మనుబోలు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం మొత్తం 352 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశామని, లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు 386 మంది సూపర్‌వైజర్లు, 1,158 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ విధుల కోసం మొత్తం 1,591 మంది పోలీసు సిబ్బందిని నియమించామని, వీరిలో 8 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 83 మంది ఎస్ఐలు, 765 మంది కానిస్టేబుళ్లు, 700 మంది ఇతర పోలీసు సిబ్బంది (ఏఎస్ఐ, ఏఆర్ఎస్ఐ, ఏఆర్పీసీ) ఉన్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు.