జర్నలిస్టుల సంక్షేమమే ఏపీఎంఎఫ్ ప్రధాన ఉద్దేశం: పి. ఢిల్లీబాబు రెడ్డి
విజయనగరం సూర్య: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (APMF) విజయనగరం జిల్లా వార్షిక మహాసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడుగా APMF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పి. ఢిల్లీబాబు రెడ్డి హాజరై మాట్లాడుతూ... "ఎల్లవేళలా జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యలను తెలుసుకొని మా సంఘం తరఫున ప్రభుత్వంతో పోరాడి వారికి మేలు జరిగేలా చూడడమే మా ప్రధాన ఉద్దేశం" అని అన్నారు.60 సంవత్సరాలు పైబడిన జర్నలిస్టు మిత్రులకు పెన్షన్ పథకం అమలు కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని, దానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నామని, ఎలాగైనా పెన్షన్ సదుపాయం సాధించేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని ఆయన తెలిపారు. ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇస్తున్నా, ఏ ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలను మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాలకు వినతి పత్రాలు అందజేస్తున్నామని అన్నారు. అలాగే ఈ సంవత్సరం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించామని పేర్కొన్నారు. ముఖ్య అతిథి మజ్జి సిరి సహస్ర మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులను ఈ విధంగా కలుసుకోవడం చాలా శుభదాయకమని, అదేవిధంగా నిరంతర శ్రామికులగా ఉన్న పాత్రికేయులుకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, సమాజం కోసం అహర్నిశలు కష్టపడుతున్న పాత్రికేయులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆమె తెలిపారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోట్ల రఘు మాట్లాడుతూ పాత్రికేయుల సమాజానికి ఎంతో కీలకమని ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉన్న పాత్రికేయులు సమాజంలో జరుగుతున్న దుష్ట సంఘటనలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని, సమాజంలో దశాదిశా నిర్ణయించేది పత్రిక నేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ & పీఆర్ డిపార్ట్‌మెంట్ ఏడీ గోవిందరాజులు పాల్గొని మాట్లాడుతూ... జర్నలిస్టులు తమకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్నారని, వారికి గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ మహాసభకు విశాఖ జిల్లా APMF అధ్యక్షులు కె. కిరణ్ కుమార్, రాష్ట్ర ఉప కార్యదర్శి లత, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు సుధీర్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు డాక్టర్ తమ్ము అప్పలరాజు, కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన జర్నలిస్టు మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై, విజయనగరం జిల్లా శాఖకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.