BREAKING
హార్ముజ్ జలసంధిలో ఎరువుల సరఫరా ప్రణాళిక అమలు కాకపోతే ప్రపంచ ఆహార సంక్షోభం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న హర్ష చెముడు వెబ్ సిరీస్! సెప్టెంబర్‌లో పెరిగిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గోపీచంద్ ‘భరతవర్ష’ నుంచి నవదుర్గల వైభవంగా ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్.. ఆధ్యాత్మిక శోభలో ట్రెండింగ్! ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన పోప్ లియో నాగచైతన్య, దుల్కర్ లాంచ్ చేసిన ‘డోంట్ స్లీప్’ టీజర్.. హాలీవుడ్ రేంజ్‌లో సైకలాజికల్ థ్రిల్లర్! రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం ఓటీటీలో తగ్గేదేలే అంటున్న స్లైస్ ఆఫ్ లైఫ్ వెబ్ సిరీస్‌లు.. దుపహియా సీజన్ 2 సరికొత్త రికార్డులు! వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్ వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం సందీప్ కిషన్ ‘కరికాల’ మూవీలోకి గాయత్రి భరద్వాజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్! స్మార్ట్‌ కార్డులపై గ్రామాల పేర్లు నమోదు చేయాలి!

జనసేన లో రాధా

Select Suryaa Now
జనసేన లో రాధా

జనసేనలోకి వంగవీటి రాధా..

వైసీపీలోకి బొండా ఉమా?

అనూహ్యంగా మారుతున్న రాజకీయ పరిణామాలు

ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి

రాజకీయ రాజధాని విజయవాడలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలోనూ ఇదే రీతిలో సమీకరణాలు మారిన సంఘటనలు లేకపోలేదు. ఇప్పుడు మరోసారి వంగవీటి రాధాకృష్ణ, బొండా ఉమామహేశ్వరరావు చుట్టూ సాగుతున్న చర్చలు రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో బుధవారం పార్టీలో చేరనున్నారు. మరోవైపు విజయవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న బొండా ఉమామహేశ్వరరావు భవిష్యత్తుపైనా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ పదవి కూటమి పార్టీల మధ్య కీలకంగా మారింది. ఈ పదవిని దక్కించుకోవడానికి తెలుగుదేశం, జనసేన నేతలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ జనసేన వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన సతీమణి వంగవీటి పుప్పవల్లికి మేయరు పదవిని కేటాయించడానికి కూటమి నిర్ణయం తీసుకున్నది. రాధాకృష్ణకు, ఆయన తండ్రి వంగవీటి మోహనరంగా అభిమానులు, రాధా అనుచరులు నగర రాజకీయాల్లో ప్రభావం చూపగలరని భావించి ఈ సీటు కేటాయింపు జరిగినట్టు చెబుతున్నారు. ఈ బలాన్ని స్థానిక ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని జనసేన భావిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, బొండా ఉమా రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చలు మొదలయ్యాయి. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు దీనిని రాజకీయ ఊహాగానంగానే చూడాల్సి ఉంటుంది.

విజయవాడ రాజకీయాల్లో రంగా నుంచి రాధా వరకు.. నెహ్రూ నుంచి అవినాష్‌ వరకు!

విజయవాడ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే వంగవీటి మోహనరంగా, దేవినేని నెహ్రూ రాజకీయ ప్రస్థానాలను, వారి వారసులైన వంగవీటి రాధాకృష్ణ, దేవినేని అవినాష్‌ రాజకీయ అరంగేట్రాలను ప్రస్తావించాల్సిందే. ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ పోటీ బెజవాడ రాజకీయాలపై దశాబ్దాలుగా ప్రభావం చూపుతోంది. పార్టీలు మారినా, నాయకత్వాలు మారినా ఈ కుటుంబాల చుట్టూ రాజకీయ చర్చ కొనసాగుతూనే ఉంది.

రంగా కాంగ్రెస్‌లోకి.. నెహ్రూ తెలుగుదేశంలోకి

విజయవాడలో వంగవీటి మోహనరంగా, దేవినేని రాజశేఖర్‌ (నెహ్రూ) రాజకీయంగా రెండు ప్రధాన శక్తులుగా ఎదిగారు. రంగా కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించగా, నెహ్రూ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో తనదైన గుర్తింపు సంపాదించారు. రంగా 1985లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. నెహ్రూ 1983లో కంకిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. రంగా, నెహ్రూ కుటుంబాల మధ్య రాజకీయ పోటీ విజయవాడకే పరిమితం కాకుండా కృష్ణా జిల్లా రాజకీయాలపైనా ప్రభావం చూపింది. సామాజిక వర్గాల సమీకరణలు, యువత మద్దతు, స్థానిక నాయకత్వం ఈ పోటీలో కీలక పాత్ర పోషించాయి. 1988 డిసెంబరు 26న రంగా హత్యకు గురికావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తరువాత కూడా ఆయన పేరు, అభిమాన వర్గం విజయవాడ రాజకీయాల్లో ప్రభావవంతంగానే కొనసాగాయి.

రంగా వారసుడిగా రాధాకృష్ణ రాజకీయ అరంగేట్రం

వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ 2004లో ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధాకృష్ణకు విజయవాడలో ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన విజయం సాధించలేకపోయారు. అనంతరం 2012లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు. పార్టీలు మారినా రాధాకృష్ణ చుట్టూ విజయవాడ రాజకీయాల్లో చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్‌ కూడా తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి నాయకుడిగా, యువజన విభాగాల్లో పనిచేసిన ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. 2016లో తెలుగుదేశం పార్టీలో చేరిన అవినాష్‌ ఆ పార్టీ యువజన విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2019లో గుడివాడ శాసనసభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే ఏడాది నవంబరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసినా విజయం దక్కలేదు.

వారసత్వ రాజకీయాల నుంచి కొత్త సమీకరణాల దిశగా..

వంగవీటి రాధాకృష్ణ, దేవినేని అవినాష్‌ ఇద్దరూ తమ తండ్రుల రాజకీయ వారసత్వంతో ప్రజాజీవితంలోకి వచ్చినప్పటికీ, వారి రాజకీయ ప్రయాణాలు వేర్వేరు పార్టీల మీదుగా సాగాయి. రాధాకృష్ణ కాంగ్రెస్‌, ప్రజారాజ్యం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల్లో పనిచేయగా, అవినాష్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల్లో కొనసాగారు. ఇప్పుడు విజయవాడలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ మొదలైన నేపథ్యంలో, రాధాకృష్ణ జనసేనలో చేరతారన్న ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో బొండా ఉమామహేశ్వరరావు రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాలమే వీటిని నిర్ణయించనున్నది.