ఇచ్చాపురం అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి
కోటబొమ్మాళి, సూర్య : ఇచ్చాపురం పట్టణ సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ అశి లీలావతికి సూచించారు. బుధవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రిని లీలావతి మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మున్సిపల్ చైర్‌పర్సన్ బాధ్యతను పదవిగా కాకుండా ప్రజాసేవకు దక్కిన అవకాశంగా భావించాలని హితవు పలికారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజాసమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించారు. కూటమి విజయానికి, పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసిన మంత్రి, నాయకులందరినీ కలుపుకొని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.