andhrapradesh
హైకోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుబంధ పిటిషన్
అమరావతి:పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై హైకోర్టులో విచారణ వేగవంతమైంది. పులివెందుల మున్సిపాలిటీలో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
నాలుగు రోజుల క్రితమే పులివెందులలో పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, నిన్నటి పోలింగ్ సందర్భంగా భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని, ప్రతిపక్ష ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఆ ప్రధాన పిటిషన్‌కు అనుబంధంగా ఇవాళ మరొక పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ అనుబంధ పిటిషన్‌లో పులివెందుల మున్సిపాలిటీ వ్యాప్తంగా రీపోలింగ్ ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పిటిషనర్ తరుఫు న్యాయవాది విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెంచ్.. ఈ అంశంపై మధ్యాహ్నం ప్రత్యేకంగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.