గ్రామపంచాయతీలు, మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్ : జిల్లాలోని గ్రామపంచాయతీలతో పాటు పెండింగ్‌లో ఉన్న గూడూరు, కావలి, అల్లూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ హిమాన్షు శుక్ల ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనువైన ప్రదేశాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో విజయ్‌కుమార్, డీపీవో వెంకట్రామన్ తదితర అధికారులు పాల్గొన్నారు.