గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు
– ఐజీ వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించిన ఎస్పీ కే. చక్రవర్తి, ఐపీఎస్
- ఏలూరు రేంజ్ ఐజీ వీడియో కాన్ఫరెన్స్
రంపచోడవరం సూర్య ప్రతినిధి : ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ ఏడు జిల్లాల ఎస్పీలతో రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలు మరియు భద్రతా ఏర్పాట్లపై ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం జిల్లా ఎస్పీ కే. చక్రవర్తి, ఐపీఎస్ పాల్గొని జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ముందస్తు చర్యలు, పోలీస్ బందోబస్తు ప్రణాళికలను ఐజీ గారికి వివరించారు.
ఈ నెల 26న మొదటి విడత, 29న రెండవ విడత ఎన్నికలు, తదనంతరం కౌంటింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పోలవరం జిల్లాలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గారు తెలిపారు. ఈనెల జరగబోయే 26, 29న గ్రామపంచాయతీ ఎన్నికలకొరకు సివిల్, ఏ ఆర్, ఏపీ ఎస్పీ, సి ఆర్ పి ఎఫ్, గ్రేహౌండ్స్, ఏ ఎన్ ఎస్ లతో ఆర్ఓపీలు, ఏరియా డామినేషన్ బృందాలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , స్ట్రైకింగ్ ఫోర్స్,క్యూఆర్టీ, రూట్ మొబైల్ పార్టీలను అవసరమైన ప్రాంతాల్లో మోహరించి ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలవరం జిల్లా పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తతతో పనిచేస్తుందని ఎస్పీ గారు ఐజీకి వివరించారు.