గ్రామాల్లో ఎన్నికల ప్రచార జోరు
సంతబొమ్మాళి, అక్టోబర్ 26, మేజర్ న్యూస్ :సంతబొమ్మాళి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గ్రామగ్రామాన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ముఖ్యంగా మేజర్ పంచాయతీ నౌపడలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. నౌపడలో టీడీపీ మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ అభ్యర్థి సుగ్గు శాంతి స్వరూపరెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలోని ఓటర్లను నేరుగా కలుస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి లోపుంటి రాములు సైతం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఇదిలా ఉండగా, వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాల లక్ష్మి సోమవారం సంతబొమ్మాళి, లక్ష్మీపురం, శివరాంపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ పాల వసంతరెడ్డి వడ్డివాడ, యామలపేట, హెచ్.ఎన్.పేట, ఆకాశలక్కవరం గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగించారు. నౌపడ-సీతానగరం పరిధిలో వైసీపీ ఎంపీటీసీ-2 అభ్యర్థి వాడరేవు మీనాక్షి సైతం ఓటర్లను కలుస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యమిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో మరింత చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.