ఘనంగా జాతిపిత జయంతి
సంతబొమ్మాళి, అక్టోబర్ 2, మేజర్ న్యూస్ :
మండలంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు.
నౌపడ సచివాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పావురాలను ఎగరవేసి శాంతి, అహింసకు ప్రతీకగా గాంధీజీ సందేశాన్ని స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలను నేటి తరానికి అందించడంతో పాటు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, స్వచ్ఛత భావాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కర్రీ విష్ణుమూర్తి, టిడిపి సీనియర్ నాయకులు వాడరేవు కృష్ణ రావు, సుగ్గు నాగిరెడ్డి,అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.