గెజిట్ ధరల ప్రకారమే ఎగ్జిబిషన్‌లో ధరలు అమలు చేయాలి
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
మున్సిపల్ ఎగ్జిబిషన్‌లో గెజిట్‌లో నిర్దేశించిన ధరల ప్రకారమే వస్తువులు, సేవలను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మాజీ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండ్లూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్‌లో నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తూ ప్రజలపై భారం మోపకుండా అధికారులు పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. గెజిట్‌లో పొందుపరిచిన ధరలను ఎగ్జిబిషన్ నిర్వాహకులు తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా అన్యాయం కలగకుండా ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. ఎగ్జిబిషన్‌లో ధరల అమలును నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, అధికారులను అక్కడ అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం తాను నిరంతరం పోరాడుతున్నానని పేర్కొన్నారు.
కమిషనర్ సానుకూల స్పందన:
ప్రవీణ్ కుమార్ రెడ్డి సమర్పించిన వినతిపత్రంపై మున్సిపల్ కమిషనర్ తోదిక శ్రీనివాస విశ్వనాథ్ సానుకూలంగా స్పందించారు. గెజిట్ నిబంధనల ప్రకారమే ఎగ్జిబిషన్‌లో ధరలు అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎగ్జిబిషన్ పర్యవేక్షణ కోసం ముందుగానే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు, మున్సిపాలిటీకి ఎలాంటి చెడ్డపేరు రాకుండా ఎగ్జిబిషన్ నిర్వహణలో అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎం.ఈ., మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.