గీత కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి
భీమవరం, సూర్య న్యూస్: గీత వృత్తిని కాపాడాలని, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భీమవరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది గీత కార్మికులు మోకులు, కల్లుతో ర్యాలీగా తరలివచ్చి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద కల్లు పారబోసి నిరసన తెలిపారు.సీఐటీయూ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్, జిల్లా కోర్టు మీదుగా సాగిన ఈ ప్రదర్శనలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని, బెల్టు షాపులను రద్దు చేయాలని, గీత వృత్తిని పరిరక్షించాలని నినాదాలు చేశారు. అధికారికి వినతిపత్రం అందజేసే విషయంలో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సంఘ నాయకులు, టూ టౌన్ ఎస్‌ఐ కె. రామారావు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఎక్సైజ్ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ జిల్లాలో బెల్టు షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం విక్రయాల వల్ల కల్లు విక్రయాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా, పింఛన్లు, సంక్షేమ పథకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక తరహాలో కల్లు విక్రయాలకు అనుకూలమైన విధానాన్ని రూపొందించాలని, ఎక్సైజ్ పాలసీని సవరించాలని కోరారు. గీత వృత్తిని నిర్వీర్యం చేసే చర్యలను ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.సంఘ జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ 50 ఏళ్లు నిండిన గుర్తింపు కార్డులు కలిగిన గీత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు. వృత్తిలో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, శాశ్వత వికలాంగులకు రూ.10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తరహాలో భద్రతా మోకులు ఇవ్వడంతోపాటు, దహన సంస్కారాలకు రూ.50 వేలు, వైద్య ఖర్చులకు రూ.30 వేలు అందించాలని కోరారు.గీత కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, వృత్తి పరిరక్షణపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని మునిస్వామి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇతర సంఘాల సహకారంతో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.ఈ నిరసనకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. క్రాంతిబాబు, పట్టణ పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్ ఎం. వైకుంఠరావు సంఘీభావం తెలిపారు. సంఘ నాయకులు బొక్కా చంటి, కడలి పాండు, మామిడిశెట్టి నాగభూషణం, బొంతు శ్రీనివాస్, దాసరి సూరిబాబు, చింతపల్లి చిన్న వీరాస్వామి, కాగిత రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా