గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపు
శ్రీకాకుళం అక్టోబర్ 2 మేజర్ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకల్లో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన మున్సిపల్ కార్యాలయంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత దేశాల్ల వీధిలో ఉన్న బాపూజీ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి స్థానికంగా ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, ఒకే రోజు ఇద్దరు మహనీయుల జయంతి రావడం ఎంతో విశేషమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడమే కాకుండా, స్వచ్ఛతే సేవగా భావించి గ్రామ స్వరాజ్య సాధనకు ఆనాడే స్వయంగా వీధులు ఊడ్చి బాపూజీ మార్గదర్శకత్వం వహించారని గుర్తుచేశారు. స్వచ్ఛభారత్ ఆలోచన గాంధీజీ ఎంతటి ముందుచూపుతో చేశారో నేటికీ స్పష్టమవుతోందని చెప్పారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యం, ఆనందం సాధ్యమవుతాయని, తద్వారా సమాజం, దేశం సమగ్ర అభివృద్ధి సాధిస్తాయని ఆయన అన్నారు.
కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వచ్ఛతా కార్యక్రమాలు, మొక్కలు నాటే ఉద్యమాలను చేపడుతున్నాయని తెలిపారు. బాపూజీ కలలుగన్న స్వచ్ఛభారత్, గ్రామ స్వరాజ్య ఆశయాలను నిజం చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు స్వచ్ఛభారత్ సంకల్పంతో తమ పరిసరాల పరిశుభ్రతకు కట్టుబడి ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ దిశగా అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్దలు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.