ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛను పంపిణీ – పొలం బాట పట్టిన టిడిపి నాయకులు, సచివాలయ సిబ్బంది..
ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛను పంపిణీ – పొలం బాట పట్టిన టిడిపి నాయకులు, సచివాలయ సిబ్బంది..
రామగిరి మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన "ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్" పంపిణీ కార్యక్రమంలో భాగంగా అధికారుల బాధ్యతాయుతమైన పనితీరు, ప్రజాప్రతినిధుల చొరవ మరోసారి స్పష్టమైంది. లబ్ధిదారులు పింఛను సొమ్ము కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, వారి ఇంటి వద్దకే కాదు, వారు పనిచేసే పని ప్రదేశాలకే వెళ్లి నేరుగా పింఛన్లు అందజేసే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం నసనకోట పంచాయతీ పరిధిలోని కొత్తగేరి గ్రామంలో పింఛనుదారులు ఉపాధి, జీవనోపాధి కోసం పొలం పనులకు వెళ్లగా, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక టిడిపి యువ నాయకులు లింగా శ్రీధర్ నాయుడు స్వయంగా రైతు పొలాల్లోకి వెళ్ళి లబ్ధిదారులకు పింఛను సొమ్మును అందజేశారు.
టిడిపి నాయకులు లింగా శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ఈ పంపిణీ కార్యక్రమంనిర్వహించబడింది అని ,వయోవృద్ధులు, వికలాంగులు మరియు పనికి వెళ్లిన పేద ప్రజలకు పింఛను అందడంలో ఎటువంటి ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.ఎండనకా, వాననకా కష్టపడే కూలీలకు, వృద్ధులకు వారు పనిచేసే ప్రదేశంలోనే పింఛను అందించడం పట్ల గ్రామస్తులు మరియు లబ్ధిదారులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలు నేరుగా పేదల గుమ్మాలకే కాకుండా వారి పని ప్రదేశాల దాకా రావడం నిజమైన సామాజిక భద్రతకు నిదర్శనమని స్థానికులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి శ్రీనివాసులు స్థానిక నాయకులు కే. సుబ్బారావు, సి. రవికుమార్ సచివాలయం సిబ్బంది మరియు పంచాయతీ ప్రతినిధులు పాల్గొని పింఛన్ల పంపిణీని విజయవంతం చేశారు.