ఎన్నికల నియమావళి పాటించాలి.
వ్యక్తిగత విమర్శలు,సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పవు.
కాశీబుగ్గ డిఎస్పీ జివి రమణ.
పలాస, అక్టోబర్ 26, మేజర్ న్యూస్.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ, పలాస మండల పరిధిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కాశీబుగ్గ డిఎస్పీ జివి రమణ విజ్ఞప్తి చేశారు.కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణలో సోమవారం ఎర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం రాజకీయ విమర్శలకే పరిమితం కావాలి. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు, అసభ్య పదజాలం, కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తప్పుడు సమాచారం, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు, రెచ్చగొట్టే సందేశాలు ప్రచారం చేయవద్దు. అటువంటి పోస్టులు పెడితే చర్యలు తప్పవు.గ్రూపుల్లో విద్వేషపూరిత సందేశాలు రాకుండా అడ్మిన్లు పర్యవేక్షించాలి. అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిని గ్రూపు నుంచి తొలగించాలి.ప్రచారం, ర్యాలీలు, ఊరేగింపుల్లో డీజే వినియోగానికి అనుమతి లేదు.ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించే ముందు పోలీసులకు సమాచారం ఇచ్చి అనుమతి పొందాలి.అన్ని పార్టీల పట్ల సమాన వైఖరితో వ్యవహరిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఆధారాల మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా గొడవలు, బెదిరింపులు జరిగితే వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పుకార్లు నమ్మవద్దని డిఎస్పీ జివి రమణ కోరారు.