ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
: డి.ఎస్.పి .లక్ష్మణరావు
మెలియాపుట్టి. అక్టోబర్ 26. మేజర్ న్యూస్... స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని టెక్కలి డీఎస్పీ డి. లక్ష్మణరావు కోరారు. ఎన్నికల నియమాలు, నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మెలియాపుట్టి మండలంలోని జలకలింగపురం గ్రామంలో సోమవారం ఎన్నికలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ డి. లక్ష్మణరావు, పాతపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. వెంకటరావు, మెలియాపుట్టి ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకూడదని సూచించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.అనంతరం అధికారులు మెలియాపుట్టి మండలంలోని మర్రిపాడు-సి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వసుంధర చెక్‌పోస్టును సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలను తనిఖీ చేసి, ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం నిఘా కొనసాగించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.