ఎంపీటీసీ స్థానాల్లో పోటీకి భాజపా సన్నద్ధం...!! కూటమి అంగీకరిస్తే దిగుతాం
ఆనందపురం, సూర్య : మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. కూటమి పక్షాల సమన్వయంతో పోటీ చేసే విషయంలో అంగీకారం కుదిరితే, పరస్పర అవగాహనకు అనుగుణంగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలోని భాజపా కార్యాలయంలో గురువారం పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పిల్ల విజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండల ఇన్ఛార్జి కేఎన్పీ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
కూటమి పక్షాల మధ్య సమన్వయం కుదిరితే, పరస్పర అంగీకారంతో అనుకూల స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. బలమైన అభ్యర్థులకు ఎంపీటీసీ స్థానాలు కేటాయించే విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం, ధర్మం, ప్రజల రక్షణ కోసం సమష్టిగా పనిచేయాలనే సంకల్పంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఉప్పాడ అప్పారావు, పి.వి.వి. ప్రసాద్ పట్నాయక్, మీసాల రామానాయుడు, ఇల్లిపిల్లి వెంకట్, డి.పి. రాజు, మాదా బత్తుల బుజ్జి, గోపి, అడ్డూరి సురేష్, పోతిన జీవన్ సంతోష్, సీతం నాయుడు, గండ్రెట్టి వెంకటరమణ, ఉప్పాడ శివ, పి. గోవింద్, నిమ్మకాయల అప్పలరాజు, మీసాల పైడినాయుడు, దక్క వెంకటరమణ, ఏలూరి ధర్మావతి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీనివాస్, ఆనందపురం, విశాఖపట్నం.