ఈవీఎంలైనా, బ్యాలెట్ లైనా గెలుపు కూటమిదే : ఎమ్మెల్యే నసీర్
గుంటూరు : ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాదని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. మంగళవారం స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రావుతో కలిసి ఎమ్మెల్యే నసీర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బాగా బుద్ధి చెప్పారని చెప్పారు. గతంలో ఈవీఎంలపై తమ ఓటమి నెపాన్ని నెట్టిన వైసీపీ .. ఇప్పుడు బ్యాలెట్ పోరులోనూ బొక్కా బోర్లా పడిందని తెలిపారు. ఇప్పుడు ఫలితాలను చూసి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సోషల్ ఇంజినీరింగ్ పేరిట జగన్ హయాంలో బీసీల రిజర్వేషన్ ను 24 శాతానికి తగ్గించి 16,800 మందికి రాజ్యాంగ పదవులు రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. కోర్టులో బీసీల రిజర్వేషన్లపై అడ్డంకులు ఎదురైనప్పటికీ టీడీపీ 34 శాతం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిందనన్నారు. అదే సమయంలో విద్యావంతులతో పాటు మహిళలకు 50 శాతం టికెట్లు అందించి గౌరవించినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లోనూ గ్రామీణ ప్రజలు కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను సైతం అధిగమించి ప్రజలకు మంచి చేస్తున్నారని చెప్పారు. ఎల్ నిలోతోపాటు రెండు తుఫాన్ల సమయంలోనూ ప్రజలకు కూటమి అండగా నిలిచిందన్నారు. ఐక్యతకు మారుపేరు కూటమి నాయకత్వమని, అందుకే ప్రత్యర్థి పార్టీ రాష్ట్రంలో అడ్రస్ గల్లంతు అవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కేవలం అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలోనూ నంబర్ వన్ స్థానంలో నిలవబోతోందని, రాష్ట్రానికి స్వర్ణయుగం రాబోతోందని చెప్పారు. జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజల ఛీకొట్టారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు పరుగులు తీస్తున్నాయని తెలిపారు. యువత భవితను బంగారుమయం చేసేందుకుగాను రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల్లో 17 వేల మంది వైసీపీ తరఫున పోటీలో నిలిచారని, అయితే ప్రజలు కూటమికి 94 శాతం స్ట్రైక్ రేట్ తో విజయాన్ని అందించారని తెలిపారు. తల్లికి వందనం, దీపం పథకం, స్త్రీశక్తి పథకం వంటి కార్యక్రమాలతో పేదలకు సంక్షేమాన్ని అందించామన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పాలనతో పంచాయతీలకు మహర్దశ వచ్చిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నామని తెలిపారు.
సూర్య నాయక్