దుర్గాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో వెలసియున్న ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష హోమాలు, శాస్త్రోక్త అర్చనలు నిర్వహించారు.
ఉదయం వేళ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని 'శ్రీ దుర్గాదేవి' విశేష అలంకారంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం లోకకల్యాణార్థం అర్చకులు శాస్త్రోక్తంగా సంపుటీకరణ చండీహోమం జరిపించారు. అదేవిధంగా దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ సుందరేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ లలితా కుంకుమార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు.
సాయంత్రం అమ్మవారి మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల శోభాయమాన పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు.పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నేడు మహర్నవమి సందర్భంగా ఆలయంలో విశేష క్రతువులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పూర్ణాహుతి, రాత్రి 10:45 గంటలకు సువాసిని పూజ, అనంతరం రాత్రి 10:56 గంటల నుంచి 11:00 గంటల మధ్య శాస్త్రోక్తంగా కలశ ఉద్వాసన కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు.
ఈ ఉత్సవ ఏర్పాట్లను ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వాహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, ముఖ్య ఉత్సవ అధికారి కోవూరు జనార్ధన్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఏలూరు శిరీష, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు శ్రీ సూరావర్ఝుల రఘురామమూర్తి, అర్చక బృందం, ఆలయ సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షించారు.