డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.10 కోట్ల మోసం
విజయవాడ: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడి నుంచి ఏకంగా రూ.10 కోట్లు దోచుకున్న ఘటన విజయవాడలో వెలుగుచూసింది. బాధితుడు విశ్రాంత ఇంజినీర్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల పేరుతో ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. వివిధ కేసుల్లో తన పేరు ఉందంటూ వృద్ధుడిని బెదిరించినట్లు సమాచారం. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయభ్రాంతులకు గురిచేసి, తమకు చెప్పిన విధంగా డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారు.
దీంతో నిందితుల మాటలు నమ్మిన బాధితుడు నాలుగు లావాదేవీల్లో రెండు బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.10 కోట్లు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీ మొత్తంలో నగదు బదిలీ కావడంతో బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తూ సైబర్ నేరగాళ్ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.