ది వీక్ హెరిటేజ్ అవార్డ్స్‌లో శ్రీశైలం, అహోబిలం ఆలయాలకు సిల్వర్ అవార్డులు -- మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, అహోబిలం దేవస్థానాలకు ప్రతిష్ఠాత్మకమైన ది వీక్ హెరిటేజ్ అవార్డ్స్ – 2026లో సిల్వర్ అవార్డులు లభించడం పట్ల మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, భక్తులకు, దేవాదాయ శాఖ అధికారులకు, ఆలయ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైలం దేవస్థానానికి స్పిరిట్యుయల్ టూరిజం విభాగంలో, అహోబిలం దేవస్థానానికి సస్టై నబుల్ టూరిజం విభాగంలో సిల్వర్ అవార్డులు లభించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వారసత్వ సంపదకు దక్కిన విశిష్ట గుర్తింపుగా మంత్రి అభివర్ణించారు.ఆంధ్రప్రదేశ్ అనాదిగా ఆధ్యాత్మికతకు, ఆలయ సంప్రదాయాలకు, శిల్పకళా వైభవానికి నిలయంగా ఉందని, రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయాలు కేవలం భక్తి కేంద్రాలే కాకుండా భారతీయ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలకు సజీవ ప్రతీకలని పేర్కొన్నారు. ఈ అవార్డులు ఆంధ్రప్రదేశ్‌ను ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని మంత్రి ఆనం తెలిపారు.