దసరా ట్రాఫిక్ రద్దీ 62 శాతం తగ్గింపు: పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు
విజయవాడ, మేజర్ న్యూస్: విజయవాడలో దసరా ఉత్సవాలు, జాతీయ సరస్, విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమాల సందర్భంగా ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్‌ను నియంత్రించినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు తెలిపారు. ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం ఆధ్వర్యంలో చేపట్టిన ముందస్తు చర్యలతో 2025తో పోలిస్తే 2026 దసరా ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ రద్దీ 62 శాతానికి పైగా తగ్గినట్లు పేర్కొన్నారు. గత ఏడాది మొత్తం ట్రాఫిక్ రద్దీ 1,311 కిలోమీటర్లు ఉండగా, ఈ ఏడాది 497 కిలోమీటర్లకు తగ్గిందని, రోజువారీ సగటు రద్దీ 119 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పడిపోయిందని వివరించారు. అలాగే తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ హెచ్చరికలు 2025లో 221 ఉండగా, ఈ ఏడాది 38కి తగ్గి 83 శాతం మేర తగ్గుదల నమోదైందన్నారు. ఏపీ ఆస్ట్రామ్ ద్వారా రియల్‌టైమ్ ట్రాఫిక్ పర్యవేక్షణ, హెచ్చరికలతో సమస్యలను తక్షణమే పరిష్కరించినట్లు తెలిపారు. సరస్ ప్రాంగణం, ఏలూరు రోడ్డు, పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రవేశ మార్గం, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులను పక్కాగా అమలు చేసి వాహనదారులు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారీ కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణలో సమన్వయంతో పనిచేసిన అధికారులు, సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.