చీపురుపల్లి లో కూటమికి బీటలు
చీపురుపల్లి, సూర్య : చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల తీరుపై ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించి కొత్తవారికి, అవగాహన లేనివారికి ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశాలు కల్పిస్తున్నారంటూ తమ్ముళ్ళు విమర్శిస్తున్నారు. సొంత పార్టీలో ఇలా ఉంటే ఇక కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీల పరిస్థితి అసలు చెప్పుకోలేని దుస్థితి దాపురించిందని పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో 72 ఎంపీటీసీ స్థానాలు ఉంటే అన్ని చోట్ల టీడీపీ పోటీచేస్తుందని ప్రకటించడం తర్వాత జనసేన నేతలు గట్టిగా పట్టుబడితే నాలుగు స్థానాలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని వారు తెలిపారు. ఇక కూటమి ధర్మం ఎక్కడ పాటిస్తున్నారని ఎద్దేవ చేస్తున్నారు. నాలుగు మండలాల్లో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఇస్తూ మరో రెండు చీపురుపల్లి మండలం పాలవలస, మెరకముడిదాం మండలంలో ఉత్తరవల్లిలో టీడీపీ అభ్యర్థులను జనసేన అభ్యర్థులుగా ప్రకటించి పోటీలో ఉంచుతామని, సరిపెట్టుకోమని నాయకులు చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా టీడీపీ నాయకులు వ్యవహరిస్తే తాము తమ సత్తా చూపించాల్సి వస్తుందని జనసేన నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇక బీజేపీ నాయకులు పోటీ చేసే స్థానాలు ఒక్కటి కూడా పొందలేకపోయారు. అడిగినప్పటికీ నాయకులు హేళనగా చులకన చేస్తూ మాట్లాడి నిరుత్సాహ పరిచారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్లు స్వీకరణ మూడు రోజుల్లో ఒకరోజు గడిచినా ఆశించినంతగా నామినేషన్లు ప్రధాన పార్టీల నుంచి కార్యాలయాలకు చేరలేదు. నామినేషన్లు వేసేందుకు ఇంకా అభ్యర్థుల ఎంపికలు పూర్తి స్థాయిలో జరగలేదు. మిగిలేది రెండు రోజులే.
రిపోర్టర్ : మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా.