బ్రిక్స్ వారోత్సవాల్లో ఆహార వ్యర్థాల తగ్గింపుపై సదస్సు.
కావలి, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో జరుగుతున్న 'బ్రిక్స్-2026' ఏడు రోజుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం నాలుగవ రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ పి. నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో "ఆహార వ్యర్థాల తగ్గింపు - సేంద్రియ కంపోస్ట్ తయారీ" అనే అంశంపై జీవశాస్త్ర శాఖాధిపతి డాక్టర్ జి. రమణారెడ్డి ముఖ్య వక్తగా ప్రసంగించారు. ఈ సందర్భంగా డా. రమణారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథా చేయకుండా జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలని, తడి-పొడి చెత్తను వేరు చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మైక్రో ఆర్గానిజమ్స్ సహాయంతో సేంద్రియ వ్యర్థాలను పౌష్టిక ఎరువుగా మార్చి 'వ్యర్థాల నుంచి సంపద' సృష్టించవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం 'రెడ్యూస్, రీయూస్, రీసైకిల్' (Reduce, Reuse, Recycle) సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఎం. వెంకటేశ్వర్లు, అకడమిక్ డీన్ డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం నాయుడు, స్వయం ఉపాధి కోర్సుల సంచాలకులు డాక్టర్ ఆర్. మల్యాద్రి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎస్.కె. అయూబ్ అహ్మద్, టి.వి. రమణలతో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.