బొబ్బిలి కోటలో ఘనంగా ఆయుధ పూజ * పాల్గొన్న రాజకుటుంబం
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి రాజవంశీయులు లోకకళ్యాణానికై ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం బొబ్బిలి కోటలో జరిపించే ఆయుధ పూజ ను సోమవారం దర్బార్ మహల్లో ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు రాజవంశీయులు అయిన ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.వీ.ఎస్.కె.రంగారావు (సుజయ్ నాయన), ఆర్.వీ.ఆర్.కె.రంగారావు (రాము నాయన), ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన), విశాల్ నాయన కలిసి తమ పూర్వీకుల సింహాసనానికి మరియు ఆయుధాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం సుజయ్ నాయన మరియు బేబీనాయన మీడియాతో మాట్లాడుతూ బొబ్బిలి రాజవంశీయులు కేవలం తమ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం మాత్రమే కాకుండా లోకకళ్యాణం కోసం ఈ ఆయుధపూజను ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. తమ కుటుంబసభ్యులు ఏ ప్రాంతంలో ఉన్నా ఈ పూజకు అందరూ హాజరవుతామని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ సంవత్సరం రాజుల అభిమానులు, బందు మిత్రులు, స్నేహితులు అందరినీ ఆహ్వానించలేకపోయామని తెలియజేశారు.
రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.