బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు!
భోగాపురం, సూర్య : అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. మండల పరిధిలో బెల్టు షాపుల నిర్వహణ, అనధికార మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వి. రవికుమార్ తెలిపారు. ఈ క్రమంలో సవరవిల్లి గ్రామ పరిధిలో దాడులు నిర్వహించి, ఆరు 180 ఎంఎల్ మద్యం సీసాలతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అనుమతులు లేకుండా మద్యం దుకాణాలు నిర్వహించడం, అక్రమ మద్యం విక్రయాలను ప్రోత్సహించడం చట్టవిరుద్ధమని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. బెల్టు షాపుల నిర్వహణకు ఎవరూ పాల్పడవద్దని, అలాంటి కార్యకలాపాలకు సహకరించవద్దని ప్రజలకు సూచించింది. గ్రామాల్లో ఎక్కడైనా అనధికార మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. అక్రమంగా విక్రయించే మద్యం నాణ్యతపై నమ్మకం ఉండదని, దానిని సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అనధికార మద్యం దుకాణాల వద్ద కొనుగోళ్లు చేయకుండా, అక్రమ విక్రయాలను ప్రోత్సహించకుండా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం అనుమతించిన మద్యం దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్‌ఐ చంద్రమోహన్, హెడ్ కానిస్టేబుళ్లు ప్రతాప్, సత్యనారాయణ, కానిస్టేబుళ్లు మహేష్, సూర్యనారాయణ పాల్గొన్నారు.
రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.