అర్థరహిత విమర్శలు ఆపాలి : బహిరంగ చర్చకు రావాలి... వైసీపీ నేతల సవాల్
నరసన్నపేట, సూర్య : జగనన్న కాలనీలో నెలకొన్న సమస్యలపై యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య శుక్రవారం చేపట్టిన పర్యటన అనంతరం టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం నరసన్నపేట వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో జగనన్న కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని వైసీపీ నాయకులు విమర్శించారు. కాలనీలో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని, కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
యువనేత ధర్మాన కృష్ణ చైతన్య కాలనీ పర్యటనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారని వైసీపీ నాయకులు తెలిపారు. తాగునీరు, రహదారులు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని మాత్రమే ఆయన కోరారని, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని స్పష్టం చేశారు.
కాలనీలో సుమారు 600 ఇళ్లలో ప్రజలు నివసిస్తున్నారని, అక్కడి నివాసితులను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని పేర్కొంటూ టీడీపీ నాయకులు తమ వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్లపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని విమర్శించారు. పేద కుటుంబాలకు ఒకటిన్నర సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం అవసరమని అన్నారు.
మరోవైపు, ఇసుక అక్రమ వ్యాపారం, మద్యం సిండికేట్ల ద్వారా లబ్ధి పొందుతున్నారంటూ టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మభగాం ప్రాంతానికి వెళ్లి పరిశీలించాలని సూచించారు. పేద ప్రజల ఇళ్లపై, వారి జీవన పరిస్థితులపై కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.