అర్నబ్ తుఫాన్ దెబ్బకు నీటమునిగిన వరి పంటలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి గొట్టిపాటి, కలెక్టర్ నాగరాణి
భీమవరం, సూర్య న్యూస్: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీటమునిగి దెబ్బతిన్న వరి పంటలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామం వద్ద వ్యవసాయ పొలాల్లో నీరు నిలిచిపోవడంతో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి, రైతుల నుంచి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీటిలో మునిగిన వరి కంకులను స్వయంగా పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.
పంట నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి, కలెక్టర్ సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తూ, రైతులకు అవసరమైన సహాయక చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు.
అనంతరం దిగమర్రు గ్రామం వద్ద రహదారిపై విరిగిపడిన చెట్లను పరిశీలించారు. చెట్ల తొలగింపు పనులను సమీక్షించి, రాకపోకలకు అంతరాయం కలగకుండా పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో నరసాపురం ఆర్డీఓ కె. దాసిరాజు, పాలకొల్లు తహసీల్దార్ దుర్గా కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా,