అనుమతించిన ప్రాంతాల్లో బాణాసంచా కాల్చాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరానున్న దసరా ఉత్సవాలు, శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో శాంతిభద్రతల ఉత్సవాల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్లు, ఆర్టీసీ, విద్యుత్ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఊరేగింపుల సమయంలో ఇరుకైన రహదారులు, నివాస ప్రాంతాల్లో ఇష్టానుసారంగా బాణసంచా కాల్చరాదని స్పష్టం చేశారు. అధికారులు ముందుగా గుర్తించిన విశాలమైన ప్రదేశాల్లోనే టపాసులు కాల్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శకటాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను ముందుగానే ఖరారు చేసి, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.
విద్యుత్ తీగలు వేలాడకుండా చూడటంతోపాటు రహదారుల పరిస్థితిని సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించేందుకు అంబులెన్సులు, వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ ఉత్సవ కమిటీలు నిర్దేశించిన సమయపాలనను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయరాదన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శోభాయాత్రల్లో పాల్గొనే వాహనాల ఫిట్నెస్ను తనిఖీ చేయాలని, డ్రైవర్లు మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపకుండా బ్రీత్ అనలైజర్లతో పరీక్షలు నిర్వహించాలని పోలీసు, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతామని తెలిపారు.సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలిజాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు, కంట్రోల్ రూమ్ నిర్వహణ, అత్యవసర వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే ఉత్సవ కమిటీలతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొంటూ, ఉత్సవాలు విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, కమిటీ సభ్యులు అధికారులకు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో కొత్తపేట ఆర్డిఓ జివివి సత్యనారాయణ ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ బి రాజేశ్వరి, కొత్తపేట అమలాపురం డిఎస్పీలు ఎస్ వి ప్రసాద్,సుంకర మురళి మోహన్, అమలాపురం అంబాజీపేట ఎస్సైలు వీరబాబు శ్రీనివాస్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.