అక్వాన్ తుఫాను - ప్రయాణాలను వాయిదా వేసుకోండి.
భువనేశ్వర్ - విశాఖ మధ్య ప్రయాణించే వారికి కాశీబుగ్గ డీఎస్పీ హెచ్చరిక.
పలాస,నవంబర్ 19,మేజర్ న్యూస్.
అక్వాన్ తుఫాను ప్రభావం దృష్ట్యా నవంబర్ 19, 20 తేదీల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కాశీబుగ్గ డీఎస్పి జీ.వి రమణ సూచించారు.భువనేశ్వర్ నుండి విశాఖపట్నం వైపు, విశాఖపట్నం నుండి భువనేశ్వర్ వైపు ప్రయాణించే ప్రయాణీకులు, సరుకు రవాణా వాహనాలు ఈ రెండు రోజులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రయాణీకులకు మరియు బస్సుల యాజమాన్యానికి సూచించారు.తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, రవాణాకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.అందుకే ప్రజలు అత్యవసరం కాని ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఇప్పటికే ప్రయాణంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని, ప్రస్తుతం ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని సూచించారు.వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు ప్రయాణాలు కొనసాగించవద్దని హెచ్చరించారు.ప్రజలు తమ ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, పోలీసు శాఖ మరియు సంబంధిత ప్రభుత్వ శాఖలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కాశీబుగ్గ సబ్-డివిజనల్ పోలీస్ అధికారి జి.వి రమణ విజ్ఞప్తి చేసారు.