అగ్ని ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్తి నష్టం
సంతబొమ్మాలి సూర్య: మండలంలో నౌపడ గ్రామంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో వికలాంగుడు కర్రి నాగరాజుకు చెందిన బడ్డీ దగ్ధమై సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదంలో ఆయన దాచుకున్న నగదుతో పాటు బడ్డీలోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఒంటరిగా జీవిస్తున్న కర్రి నాగరాజు వికలాంగ పింఛన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న నెలకు రూ.6 వేల పింఛన్‌లో కొంత మొత్తాన్ని ఖర్చులకు వినియోగిస్తూ, మిగిలిన మొత్తాన్ని పొదుపు చేసుకుంటూ వచ్చాడు. ఇలా దాచుకున్న సుమారు రూ.1.20 లక్షల నగదు అగ్నికి ఆహుతైంది. బడ్డీలోని ఇతర సామగ్రి కూడా పూర్తిగా కాలిపోవడంతో నాగరాజు తీవ్రంగా నష్టపోయాడు.
తనకు ఆధారంగా ఉన్న నగదు, సామగ్రి అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో నాగరాజు కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి ఉమాపతి, వీఆర్వో జోగారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.