లక్కీ ఫ్యాషన్ షోరూంలో లిఫ్ట్‌లో చిన్నారులకు నరకయాతన..!
కరెంట్ పోయి గంటపాటు లిఫ్ట్‌లోనే బంధీ.. పైకప్పు తొలగించి రక్షించిన కస్టమర్లు
వికారాబాద్, మేజర్ న్యూస్:వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మేరీనాట్ చౌరస్తాలో వారం రోజుల క్రితం ప్రారంభమైన లక్కీ ఫ్యాషన్ షోరూంలో గురువారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. బట్టలు కొనుగోలు చేసేందుకు షోరూంకు వచ్చిన పలువురు చిన్నారులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు.విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో చిన్నారులు దాదాపు గంటపాటు లిఫ్ట్‌లో చిక్కుకుపోయి భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన కస్టమర్లు లిఫ్ట్ పైకప్పును తొలగించి చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.పిల్లలు ఇంతసేపు లిఫ్ట్‌లో చిక్కుకుపోవడంపై తల్లిదండ్రులు షోరూం యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్ నిర్వహణ, విద్యుత్ అంతరాయం సమయంలో భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. టౌన్ సీఐ రఘుకుమార్ ఘటనపై విచారణ చేపట్టారు. లిఫ్ట్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.